ఇప్పుడున్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించడమంటే... దీనిని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఎదుర్కోగల శాంతి భద్రతల అంశంగా పరిగణించడమే. కేంద్ర జోక్యాన్ని నివారించడమే. 54 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూస్తే... ప్రత్యేక తెలంగాణ డిమాండ్ తలెత్తిన ప్రతిసారీ సంబంధిత గ్రూపులకు ప్రభుత్వ, లేదా పార్టీ వ్యవస్థలో భాగస్వామ్యం కల్పిస్తూ రాజకీయంగా పరిష్కరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో... 'తెలుగు వారి ఆత్మ గౌరవ' నినాదం విభజన వాదానికి చెక్ పెట్టింది.
తెలంగాణ డిమాండ్ వెనక్కి వెళ్లినప్పటికీ... పూర్తిగా మాత్రం అదృశ్యం కాలేదు. 2000 తర్వాత మళ్లీ ఇది తెరమీదికి వచ్చింది. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పాక్షికంగానే అమలు చేయడం, రాష్ట్రపతి ఉత్తర్వులను సంతృప్తికరంగా అమలు చేయకపోవడం, ప్రాంతాల మధ్య విద్యా ప్రమాణాల్లో అంతరం, నీటి వనరుల్లో తగిన వాటా కేటాయించలేదనే వాదన, తెలంగాణ ఆర్థికాభివృద్ధిపై నిర్లక్ష్యం... ఈ అంశాల ప్రాతిపదికనే ఈసారి కూడా ఉద్యమం మొదలైంది. వీటన్నింటికంటే మించి... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే చిరకాల వాంఛతో మానసిక, భావోద్వేగమైన కారణాలు ముడిపడ్డాయి. అయితే, ఈ ప్రాంత సమగ్ర ఆర్థికాభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పేందుకు వాస్తవ ఆధారాలేవీ కమిటీకి కనిపించలేదు.
కానీ.. ఉపాధి కల్పన, విద్య, సాగునీరు వంటి అంశాలపై మాత్రం కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలనే ఆకాంక్షను తీర్చే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే... హింసాత్మక ఆందోళనలు తలెత్తే అవకాశముంది. ఈ పరిస్థితి కొన్నాళ్లపాటు కొనసాగవచ్చు. అలాగే, కొన్ని నిర్దిష్టమైన డిమాండ్లపై వేర్వేరు ప్రాంతాల్లో చెదురుమదురు ఆందోళనలు జరగవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగవచ్చు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్-గద్దర్) మరోమారు కేసీఆర్‌తో చేతులు కలిపిన నేపథ్యంలో.. ఈసారి తీవ్రమైన భావోద్వేగంతో, సీరియస్‌గా ఆందోళనలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనలు హైదరాబాద్ నగరం, దాని చుట్టు పక్కల మరోమారు సాధారణ జీవనంపై ప్రభావం చూపుతాయి.
అందువల్ల హైదరాబాద్ నగర ప్రతిష్ఠ దెబ్బతింటుంది. నగర ఆర్థికాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుంది. గతంలోలాగే... తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులపై రాజీనామా చేయాల్సిందిగా తీవ్రమైన ఒత్తిళ్లు తప్పవు. అంతిమంగా ఇది రాజకీయ సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితిని మావోయిస్టు ఉద్యమం కూడా సానుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో... యథాతథ స్థితిని కొనసాగించడం ఆచరణయోగ్యం కాదని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయడింది. యథాతథ స్థితిని కొనసాగించడమనేది చిట్టచివరి ఆప్షన్ మాత్రమే!
2. రాష్ట్రాన్ని సీమాంధ్ర,తెలంగాణగా విభజించి..హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం ! రెండు ప్రాంతాలు కొంత కాలానికి ప్రత్యేక రాజధానులు ఏర్పాటు చేసుకొవడం
(ఎ) హైదరాబాద్‌కు ఆర్థికంగా, చారిత్రకంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన చేస్తున్నాం. ఐటీ, ఐటీ అనుబంధ సేవల హబ్‌గా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో హైదరాబాద్‌కు ఉన్న స్థానం దృష్ట్యా... ఈ నగరాన్ని అభివృద్ధి చక్రానికి ఇరుసుగా భావిస్తున్నారు. ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో జాతీయ కంపెనీలు కూడా అడుగుపెట్టాయి. రంగారెడ్డి జిల్లా ప్రముఖ ఉత్పత్తి కేంద్రంగామారి కోస్తాంధ్ర, రాయలసీమతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షించింది.
ఇంకా... పెద్దసంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు, పౌర, మిలిటరీ కేంద్రాలు, రక్షణ సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటయ్యాయి. కొన్నేళ్లుగా కొనసాగుతున్న వలసలవల్ల హైదరాబాద్ నగర జనాభా ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో వీరి జనాభా మూడోవంతుకుపైగానే ఉన్నట్లు అంచనా. ఈ ప్రాంతంలో నిరంతరమైన ఆర్థికాభివృద్ధి ఉంటేనే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్‌కు దేశంలోని ఇతర ప్రాంతాలతో ఆర్థిక అనుసంధానం కొనసాగాలన్నా, వాటితో సమానంగా అభివృద్ధి చెందాలన్నా.. సుస్థిరత వాతావరణాన్ని కొనసాగించడం అవసరం.
హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితిని బెల్జియంలోని బ్రస్సెల్స్‌తో పోల్చవచ్చు. 'బెల్జియం ఎవరికి చెందాలి?' అనే అంశంపై 1968లో తీవ్రస్థాయి ఆందోళనలు జరిగాయి. ఈ సమస్యకు ఏకైక పరిష్కారంగా... బెల్జియంను రెండు సంస్కృతులతోకూడిన మూడు ప్రాంతాలుగా ప్రకటించాల్సి వచ్చింది. బెల్జియం జనాభా కోటి కాగా... అందులో 60 లక్షల మంది ఉత్తర బెల్జియంలోని ఫ్లెమిష్ భాష మాట్లాడేవారు. మరో 40 లక్షల మంది దక్షిణ బెల్జియంలోని ఫ్రెంచ్ మాట్లాడే వారు. దేశంలో కొద్ది సంఖ్యలో జర్మన్ మాట్లాడే వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రస్సెల్స్‌ను ద్విభాషా రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ... స్వతంత్ర పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఇక... స్థూలంగా ఉమ్మడి సంస్కృతి ఉన్న ఆంధ్రప్రదేశ్ మొట్ట మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. పట్టణీకరణకు సంబంధించి భావ సారూప్య అంశాలు బలంగా ఉన్న నేపథ్యంలో, కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) విధానం అనుసరణీయమనేది కమిటీ అభిప్రాయం. ఈ ఆప్షన్‌లో... రాష్ట్రాన్ని రెండుగా విభజించి, హైదరాబాద్‌ను యూటీగా ప్రకటించి, ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ... నిర్దిష్ట కాలంలో వేర్వేరు రాజధానులు అభివృద్ధి చేసుకోవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది కాబట్టి... మూడు ప్రాంతాలకు తగిన వాటాలు నిర్ణయిస్తూ పరస్పర ఆమోదానికి రావాలి.
(బి) రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలన్నదే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల ఆకాంక్ష అయినప్పటికీ... హైదరాబాద్‌తో ముడిపడిన తమ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుతున్నందున ఈ పరిష్కార మార్గం వారికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని భావించవచ్చు. అయితే... ఈ ఆప్షన్‌ను తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆందోళనకు దిగే అవకాశం ఉంది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగంగా ఉండాల్సిందేనని ఒత్తిడి చేస్తూ, ఆందోళనలు కొనసాగించడంవల్ల... యూటీలో పాలన సాగించడం కష్టతరం చేయవచ్చు. అంతేకాదు! హైదరాబాద్‌ను యూటీగా ప్రకటించడంవల్ల మరో ఇబ్బంది కూడా ఉంది.
ఆర్థికంగా, వ్యక్తిగతంగా బలమైన బంధమున్న హైదరాబాద్‌తో సీమ, కోస్తాంధ్రలకు భౌతిక బంధం తెగిపోతుంది. కోస్తాంధ్ర వైపు నల్లగొండ జిల్లాతో, రాయలసీమ వైపుగా మహబూబ్‌నగర్‌తో హద్దులు ముగుస్తాయి. వెరసి... హైదరాబాద్ యూటీ మూడు ప్రాంతాల సరిహద్దుల మధ్య ఉంటుంది. ఈ పరిస్థితిని ఆందోళనకారులు ఉపయోగించుకుని... రవాణాను, నీటి సరఫరాను అడ్డుకోవచ్చు. ఈ పరిష్కార మార్గంలో మరో ప్రతికూలత కూడా ఉంది. అదేమిటంటే... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ, అందులో హైదరాబాద్ లేనందున తెలంగాణ వాదుల ఆకాంక్ష అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. వెరసి.. ఆప్షన్ (1)లో పేర్కొన్న సమస్యలే ఇక్కడా తలెత్తుతాయి. అందువల్ల... ఈ పరిష్కార మార్గం కూడా అనుసరణీయం కాదని కమిటీ భావిస్తోంది.
3. రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్రగా ప్రకటించి..హైదరాబాద్ ను రాయల తెలంగాణలో అంతర్భాగం చేయడం
(ఎ) రాయలసీమ ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల వారు కమిటీ ముందు తమ రెండో ప్రాధాన్యంగా ఈ సూచన చేశారు. వారి మొదటి ప్రాధాన్యం మాత్రం సమైక్యాంధ్రే! మరోవైపు... ఎంఐఎం పార్టీ కూడా ముస్లింల సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా సమైక్యాంధ్రను కొనసాగించాలని... విభజించాల్సి వస్తే తెలంగాణ, రాయలసీమను కలపాలని తెలిపింది. ముస్లింలు తెలంగాణలో (హైదరాబాద్ మినహా) 8 శాతం, రాయలసీమలో 12 శాతం మంది ఉన్నారనే జనాభా ప్రాతిపదికన ఎంఐఎం ఈ వాదన చేసింది.
రాజకీయంగా ముస్లింలకు అవకాశం లభిస్తుందని తెలిపింది. ఈ పరిష్కార మార్గం చేయడానికి మరో కారణం కూడా ఉంది. మూడు ప్రాంతాల్లో రాయలసీమ అత్యంత వెనుకబడినట్లు ఆర్థిక విశ్లేషణను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఈ ప్రాంతం నీరు, సాగునీటి వనరులకోసం తెలంగాణ ప్రాంతంపై ఆధారపడి ఉంది. ఉపాధి, విద్యాపరంగా హైదరాబాద్ నగరంతో రాయలసీమకు అవసరం ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య సామాజికంగానూ సారూప్యత ఉంది. మీరు తెలంగాణతో కలుస్తారా, ఆంధ్రతో కలుస్తారా అని ప్రశ్నిస్తే... రాయలసీమ ప్రజలు తెలంగాణతో కలుస్తామనే చెప్పే అవకాశముంది. ఆర్థిక, సామాజిక కొలమానాలను లెక్కించి చూస్తే... ఈ పరిష్కార మార్గం తగినదేనని చెప్పవచ్చు.
(బి) అయితే, రాయలసీమను తెలంగాణలో కలపాలనే ప్రతిపాదనను తెలంగాణలోని అన్ని పార్టీలు, గ్రూపులు (హైదరాబాద్ పాత నగరం మినహా) బలంగా వ్యతిరేకిస్తాయి. తమ భూ వనరులను దోచుకుని, తమను వెనక్కి నెట్టేసింది రాయలసీమకు చెందిన రాజకీయ నాయకత్వమేనని వీరిలో అత్యధికులు భావిస్తున్నారు. ఈ పరిష్కార మార్గం సాధ్యాసాధ్యాలపై తెలంగాణలోని దాదాపు అన్ని బృందాలతో కమిటీ చర్చించింది. వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా రాయల తెలంగాణకు అంగీకరించలేదు.
(సి) ఒక్కముక్కలో చెప్పాలంటే... ఈ ప్రతిపాదన అటు తెలంగాణ వాదులకు, ఇటు సమైక్యవాదుల్లో ఎవరికీ ఆమోద యోగ్యం కాదు. అంతేకాకుండా... ప్రస్తుతం బరిలో ఉన్న రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి ఛాందస శక్తులు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇక... ఈ ఆప్షన్‌పై తెలంగాణలో ఆందోళనలు తప్పవు. ఆర్థిక కోణంలో ఈ పరిష్కార మార్గం సమర్థనీయమే అయినప్పటికీ, ఇది మూడు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం మాత్రం కాదు.
4. సీమాంధ్ర ,తెలంగాణగా విభజిస్తూ ..ఆగ్రేయంలో నల్లగొండ ద్వారా గుంటూరు జిల్లాతో,దక్షిణాన కర్నూలుతో భౌగోళిక బంధం ఉండేలా హైదారాబాద్‌లోను విస్తరించి యూటీగా ప్రకటించ డం.
ఎ) అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతను వివరిస్తూ ప్రతిపాదించిన రెండో ఆప్షన్ నుంచే ఈ మార్గాంతరాన్ని ప్రస్తావిస్తున్నాం. గతంలో 175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని... ప్రస్తుతం 625 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చారు. హుడా స్థానంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన హెచ్ఎండీఏ ఆవిర్భవించింది. 7073 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హెచ్ఎండీఏ గోవా రాష్ట్రానికి రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆప్షన్‌లో విస్తరించిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని ప్రతిపాదిస్తున్నాం.
(బి) రాష్ట్రంతోపాటు, మొత్తం జాతీయ ఆర్థికాభివృద్ధి కోణంలో హైదరాబాద్ చాలా కీలకం. ఆధునిక సేవలు, రవాణా రంగంలో హైదరాబాద్ జీడీపీ గణనీయంగా పెరుగుతోంది. 1999-2000లో 43 శాతం ఉండగా... 2006-06 నాటికి 58 శాతానికి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌కు జాతీయ ఐటీ ఎగుమతుల్లో 15 శాతం వాటా ఉంది. హైదరాబాద్‌లో వృద్ధి చెందుతున్న రంగాల్లో మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ కూడా ఉన్నాయి.
ఈ నివేదికలోని హైదరాబాద్ చాప్టర్‌లో పేర్కొన్నట్లుగా... రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో ఈ నగరానికి బలమైన బంధం ఉంది. తొట్టతొలుత ఈ నగరానికి ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు. ఆ తర్వాత.. తూర్పు, ఉత్తర భారతం నుంచి కూడా వలస వచ్చిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ కూడా జాతీయ ఆర్థిక సమగ్రాభివృద్ధికి సంకేతమైన ముంబై తరహాలో మారుతోంది. వ్యూహాత్మక ప్రాధాన్యం, మేథోపరమైన సంస్థలు ఎన్నింటికో హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. దేశవ్యాప్త ప్రతిభా వ్యుత్పత్తుల వనరుగానే కాకుండా.... దేశ భద్రత కోణంలోనూ హైదరాబాద్ చాలా ముఖ్యమైనది.
(సి) పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. విస్తృత కేంద్ర పాలిత ప్రాంతం అనే మార్గాంతరం అవసరమైంది. హైదరాబాద్ మహానగరంతో మూడు ప్రాంతాల వారికి భౌగోళిక అనుసంధానం ఉండటం ఇందులో సానుకూలమైన అంశం. చంఢీగఢ్ తరహాలో సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రాజధానులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. పోలీసు, పరిపాలన అధికారులందరినీ ఇప్పుడున్న స్టేట్ క్యాడర్‌ల నుంచే తీసుకోవచ్చు.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి కావాల్సినంత స్థలం అందుబాటులో ఉంటుంది. అటు చంఢీగఢ్, ఇటు ఢిల్లీ మోడళ్ల మిశ్రమంగా... సొంత శాసన సభను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చంఢీగఢ్‌కు పొరుగునే ఉన్న మొహాలీ, దేరాబస్సీ, పంచ్‌కులా, పర్వానూ పట్టణాలతోపాటు పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లు గత కొన్ని దశాబ్దాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాయి. ఇక... ఢిల్లీ చుట్టూ ఉన్న హర్యానాలోని గుర్గావ్, సోనేపట్, యూపీలోని ఫరీదాబాద్, నోయిడాలు కూడా ఇలాగే అభివృద్ధి చెందాయి. ఇదే విధంగా... ప్రతిపాదిత కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో, హైదరాబాద్ మెట్రోపొలిస్ ఆర్థిక సామర్థ్యం ఆధారంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారు ఆశిస్తున్న ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలను శరవేగంగా సొంతం చేసుకోవచ్చు.
ఈ ఆప్షన్ మూడు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యం కావొచ్చు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తర్వాత... ప్రత్యేక రాయలసీమ డిమాండ్ కూడా ఏ క్షణమైనా తలెత్తే అవకాశం ఉంది. దీని మేరకు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని భావిస్తే... ఈ విశాలమైన కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోనే ఆ రాష్ట్ర రాజధానిని కూడా ఏర్పాటు చేయవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది కాబట్టి... ఈ ఆదాయం ఆధారంగా గ్రాంట్లను పంపిణీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం మూడు ప్రాంతాలతో సంప్రదించి, పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందానికి రావొచ్చు.
(డి) ఈ ఆప్షన్‌లో మరో కోణాన్ని పరిశీలిస్తే... ఈ ప్రతిపాదనపై తెలంగాణ వాదుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. అవి... 1) హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణలో అంతర్భాగమని, ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం ఆమోదయోగ్యం కాదని వీరు వాదిస్తున్నారు. 2) నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలను పాక్షికంగా కేంద్ర పాలిత ప్రాంతంలో విలీనం చేయడాన్ని (ఈ ప్రాంతాలు ప్రస్తుతంతో పోల్చితే భవిష్యత్తులో గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ) వ్యతిరేకించవచ్చు. అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రంలో భాగమైన హైదరాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి యూటీగా ప్రకటించడంపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు.
ఈ మార్గాంతరంలో కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ... దీనిపై రాజకీయ పక్షాల్లో ఏకాభిప్రాయం సాధించడం కష్టం కావొచ్చు. మరీ ముఖ్యంగా తెలంగాణలో తీవ్రమైన వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అంతర్భాగమైనా, కాకున్నా... ఇక్కడ మావోయిస్టు కార్యకలాపాలు పెరిగే అవకాశముందని గుర్తుంచుకోవాలి. ఈ అంశాన్ని శాంతిభద్రతలు, అంతర్గత భద్రత అనే అధ్యాయంలో సవివరంగా ప్రస్తావించాం.
5.రాష్ట్రాన్ని తెలంగాణ సీమాంధ్రగా విజజించడం. హైదరాబాద్‌నుతెలంగాణకు రాజధానిగా ప్రకటించి..సీమాంధ్రకు కొత్త రాజధానికి ఏర్పాటు చేయడం
(ఎ) ఇప్పుడున్న సరిహద్దుల ప్రకారం తెలంగాణ, సీమాంధ్రగా విభజించాలి. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పడేదాకా... హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఏర్పాటు కోసం అవసరమయ్యే నిధులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ పరిష్కార మార్గం ప్రకారం... తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలన్న ఈ ప్రాంతంలోని అత్యధికుల డిమాండ్‌ను ఆమోదించడమే. తద్వారా ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలు, సెంటిమెంట్‌ను కూడా గౌరవించినట్లవుతుంది. తమపట్ల వివక్ష , నిర్లక్ష్యం కొనసాగుతోందనే భావనను కూడా దూరం చేసినట్లవుతుంది. కమిటీ తెలంగాణలో పర్యటించిన సమయంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు ప్రజల నుంచి భారీస్థాయిలో మద్దతు లభించింది. కొంతమంది తటస్థంగా ఉన్నారు. కొన్ని వర్గాలు మాత్రం విభజన డిమాండ్‌ను వ్యతిరేకించారు. తెలంగాణలో కమిటీ గమనించిన అంశాలివి...
వరంగల్, పశ్చిమ ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, దక్షిణ ఆదిలాబాద్, మెదక్‌లోని సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని భాగాలు, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ అనుకూల భావన చాలా బలంగా ఉంది. ఇక్కడ తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న వారిలో... విద్యార్థులు (ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు), నిరుద్యోగ యువత, న్యాయవాదులు, ఎన్‌జీవోలు ఉన్నారు.
తటస్థంగా ఉన్నవారిలో అసలైన హైదరాబాదీలు, ఎంఐఎంకు చెందిన కొందరు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, రాయలసీమ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నవారు, సెటిలర్ గ్రామాలు, మండలాలు (ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ మొదలైన జిల్లాల్లోని), సీమాంధ్రతోపాటు ఇతర ప్రాంతాల నుంచి హెచ్ఎండీఏ పరిధిలో వలస వచ్చిన వారు ఉన్నారు. ఉత్తర తెలంగాణలోని కొండ ప్రాంతాల గిరిజనుల్లో అత్యధికులు ప్రత్యేక మన్యసీమను కాంక్షిస్తున్నారు. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలోని గిరిజన ప్రాంతాలను ఒకే పరిపాలన ఛత్రం కిందికి తేవాలని కోరుతున్నారు.
ఇక... ఎస్సీ/బీసీ, మైనారిటీలు తమకు రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు ఉండాలని, రిజర్వేషన్ ప్రయోజనాలు లభించాలనే సొంత ఆకాంక్ష వ్యక్తం చేశారు. (బి) ప్రస్తుత సరిహద్దుల ప్రకారం సీమాంధ్ర, తెలంగాణను విభజించాలనే ఈ ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకుంటే తలెత్తే పరిణామాలు... (1) సీమాంధ్రలో ఆందోళనలు మొదలు కావొచ్చు. (2) పదవులకు రాజీనామా చేయాలని సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. (3) కోస్తాంధ్ర నుంచి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్ కూడా తలెత్తవచ్చు. (4) నీరు, సాగునీటి అంశాలను స్వయం ప్రతిపత్తి/పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలు పర్యవేక్షించినా... కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆందోళన కొనసాగే అవకాశముంది. (5) నక్సలిజం, మత ఛాందసవాదం పెరిగే అవకాశంవల్ల... ఇది అంతర్గత భద్రతపైనా ప్రభావం చూపుతుంది.
(సి) ఆంధ్ర ప్రదేశ్ విభజన ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా పడుతుంది. చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఊపందుకుంటాయి. అంతేకాదు, కేంద్రం మొట్ట మొదటిసారిగా రాజకీయ డిమాండ్ మేరకు... రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఒక భాష ప్రాతిపదికన ఆవిర్భవించిన రాష్ట్రాన్ని ఒకే భాష (తెలుగు) మాట్లాడే రెండు రాష్ట్రాలుగా విభజించినట్లవుతుంది. దీనివల్ల తలెత్తే పరిణామాలపై ప్రశాంత చిత్తంతో, నిష్పాక్షికంగా ఆలోచించాలి. తన రాజకీయ హోదా ఎలా ఉండాలో ఒక ప్రాంతం తనంతట తాను నిర్ణయించుకునే అవకాశం కల్పించవచ్చా? దీనివల్ల పెద్దసంఖ్యలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు తలెత్తి సమన్వయం, నిర్వహణలో సమస్యలకు దారి తీసే అవకాశం లేదా... అనే విశాల కోణంలో ఆలోచించాలి.
(డి) ఇక్కడ ఆర్థిక కోణాన్ని ఏమాత్రం విస్మరించలేం. ప్రపంచ వ్యాప్తంగా... చిన్న చిన్న దేశాలు తమ ఆర్థిక అవకాశాలు, మార్కెట్, ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆర్థిక సమూహాలుగా ఏర్పడుతున్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటువల్ల అంతర్ రాష్ట్ర, రాష్ట్రం పరిధిలో వస్తువులు, సేవల వినిమయంలో గతంలో ఉన్న ఇబ్బందులకు మళ్లీ ఆస్కారమిచ్చినట్లవుతుందనే భావన ఉంది. ఉదాహరణకు.. రకరకాలైన లోకల్ ఎంట్రీ ట్యాక్స్‌లు, సెస్‌లు స్వేచ్ఛా వాణిజ్యానికి ఆటంకం కలిగించే అవకాశముంది.
రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య వస్తువుల సరఫరాను నియంత్రిస్తూ స్థానిక చట్టాలు చేసే అవకాశముంది. ఇలాంటి ఆందోళనలు కోస్తాంధ్ర, రాయలసీమలో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే తమ మార్కెట్‌కు గమ్యంగా ఉన్న, సరఫరాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ తమ సరిహద్దులకు అవతల ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. భారీ జనాభా, వ్యాపారం, హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన మార్కెట్‌ను కోస్తా ఆంధ్ర కోల్పోతుంది. ఇది కొత్త రాష్ట్రాల ఆర్థిక వృద్ధిని నిరోధిస్తుంది. విభజన వల్ల తెలంగాణ ప్రాంతం తూర్పు తీరానికి దూరమవుతుంది.
విశాఖపట్నంతో సహా పలు ఇతర రేవులతో బంధం తెగిపోతుంది. భారీ స్థాయిలో ఉన్న చమురు, సహజ వాయు నిక్షేపాల ఫలితంగా తీర ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయని పక్షంలో... సమీకృత ఆర్థిక వ్యవస్థలో దీనివల్ల రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారు లబ్ధిపొందవచ్చు. అయితే, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా స్థిరంగా ఉంటుందని అంచనా వేయొచ్చు. ఇంకా చెప్పాలంటే, దేశంలోని చాలా రాష్ట్రాల స్థూల ఉత్పత్తి కంటే ఎక్కువగానే ఉంటుంది.
(ఈ) ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘకాలంగా జరుగుతున్న పోరాటం, తీవ్రస్థాయిలో ఉన్న భావోద్వేగాలు, తమ డిమాండ్ నెరవేరకపోతే తలెత్తనున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆప్షన్‌ను పరిశీలించవచ్చు. పెద్ద మనుషుల ఒప్పందం (1956)లోని కొన్ని ముఖ్యాంశాలను అమలు చేయకపోవడం, నీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం, విద్యా సదుపాయాల కల్పనలో (హైదరాబాద్ మినహా) అలసత్వం, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో అసాధారణ జాప్యం వంటి అంశాల నేపథ్యంలో తాము వివక్షకు గురయ్యామని, తమను అణచి వేస్తున్నారనే భావన... తీవ్ర భావోద్వేగానికి కారణమైంది.
ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లో అర్థముందని, ఇది పూర్తిగా అసంబద్ధమైనదేమీ కాదని కమిటీ అభిప్రాయపడుతోంది. ఒక వేళ, రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల ప్రకారం సీమాంధ్ర, తెలంగాణగా విభజించాలనే ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకున్న పక్షంలో... పెట్టుబడులు, ఆస్తులు, జీవనోపాధికి సంబంధించి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల, హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతరుల, తెలంగాణలోని ఇతర జిల్లాల వారి ఆందోళనలను తగిన విధంగా పరిష్కరించాలి. కొత్త రాష్ట్రంలో వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ... వారిలో విశ్వాసం నింపాలి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణలోని అత్యధికులకు సంతృప్తి కలిగిస్తూనే, పైన పేర్కొన్న సమస్యలకు కారణమవుతుందని కమిటీ అభిప్రాయపడుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల మిగిలిన రెండు ప్రాంతాలపై పడే ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేం. ఈ అంశానికి సంబంధించి మంచి చెడ్డలన్నీ పరిశీలిస్తే... రాష్ట్ర విభజన అత్యుత్తమ మార్గం కాబోదు. దీనిని రెండో ఉత్తమ మార్గంగా (సెకండ్ బెస్ట్ ఆప్షన్) కమిటీ పరిగణిస్తోంది. అనివార్య పరిస్థితుల్లో మాత్రమే, అదికూడా మూడు ప్రాంతాల మధ్య సామరస్య పూర్వక అంగీకారం లభించిన పక్షంలో రాష్ట్రాన్ని విభజించవచ్చు.
6. రాష్ట్రాన్ని ఉమ్మడినిగానే ఉంచి ...తెలంగాణ ప్రాంత సామాజిక అభివృద్ధి కొన్ని నిర్ధిష్టమైన రాజ్యాంగ,చట్టబద్ధమైన చర్యలు రాజకీయ సాధికారత కోసం చట్ట బద్దమైన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం.
6.(ఎ) నివేదికలో ఇప్పటిదాకా పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే... మూడు ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యమివ్వాలని కమిటీ అభిప్రాయపడుతోంది. మరింత విస్తృతమైన, బలమైన ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణతో సహా పలు చర్యల ద్వారా దీనిని సాధించవచ్చు. ఇప్పటిదాకా సూచించిన మార్గాంతరాల్లో పేర్కొన్న ప్రకారం... బహుళ రాజధానులు, అసెంబ్లీలు, మంత్రిత్వ శాఖలు, కోర్టులు, ఇతర విభాగాలు, పరిపాలనా సదుపాయాలతో అవసరం లేదని కమిటీ భావిస్తోంది.
ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలకు అంతర్గత విభజనతో సానుకూల పరిష్కారం లభించదని... మూడు ప్రాంతాల ప్రయోజనాల కోసం సమైక్యమే అత్యుత్తమమని కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన సామాజిక, ఆర్థిక ఆందోళనలను పరిష్కరిస్తూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజ్యాంగ/చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతిపాదిస్తోంది. చట్టబద్ధమైన అధికారాలున్న తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి... పెద్ద మనుషుల ఒప్పందం మేరకు ఈ కమిటీకి తగిన స్థాయిలో నిధులు, విధులు బదిలీ చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు. కౌన్సిల్ పరిధిలోకి వచ్చే అంశాలపై కమిటీ ఒక చట్టబద్ధమైన సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
ఏయే అంశాలను మండలి పరిశీలనకు పంపాలనే అంశంపై రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేయాలి. అలాగే, కమిటీ ఒక తీర్మానం చేసి, దానికి చట్టం రూపం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తే... అసెంబ్లీలో దీనిపై చర్చ నిర్వహించాలి. ప్రాంతీయ మండలి, రాష్ట్ర ప్రభుత్వం/అసెంబ్లీ మధ్య ఏదైనా అంశంపై విభేదాలు వస్తే... దానిని గవర్నర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి నివేదించాలి. ఈ కమిటీలో ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు సమాన సంఖ్యలో ఉండాలి. వారికి ఓటు హక్కు కల్పించాలి. ఉన్నతస్థాయి కమిటీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్, శాసన మండలి అధ్యక్షుడు, ఉభయ సభల్లోని విపక్ష నేతలు, తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్షులతోపాటు రాజకీయంగా తటస్థంగా ఉండే ప్రముఖులు, రాజ్యాంగం, ప్రాంతీయ అంశాలపై పట్టు ఉన్న న్యాయ నిపుణులకు చోటు కల్పించాలి.
తెలంగాణ ప్రాంతీయ మండలి పరిశీలనకు పంపాలని భావిస్తున్న అంశాలివి...
తెలంగాణకు సంబంధించిన ప్రణాళిక, ఆర్థిక అభివృద్ధి, అభివృద్ధి ఉప ప్రణాళిక (హెచ్ఎండీయే మినహా).. నీరు, సాగునీటి రంగాలు.. స్థానిక పరిపాలన.. ప్రజారోగ్యం (వైద్య కళాశాలలు, స్పెషాలిటీ ఆస్పత్రులు మినహా జిల్లా స్థాయి ఆస్పత్రుల వరకు) పైన పేర్కొన్న జాబితా కేవలం సూచన ప్రాయమే. ఇంకా ఇందులో ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన అంశాలను చేర్చుకోవచ్చు.
ప్రాంతీయ మండలి అధ్యక్షుడిగా ఎమ్మెల్యేను నియమించాలి. క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పించాలి. ఈ మండలి తెలంగాణ ప్రాంతానికి సంబంధిన ఉప ప్రణాళికను అమలు చేస్తుంది. ఇందుకు అవసరమైన నిధులు, విధులను సమకూర్చాలి. మండలికి సొంత సచివాలయం ఉండాలి. దానికి అదనపు ముఖ్య కార్యదర్శి హోదా ఉన్న అధికారిని చీఫ్‌గా నియమించాలి. కౌన్సిల్‌కు బదిలీ చేసిన అంశాలు, పని భారాన్ని బట్టి అందులో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండాలో నిర్ణయించవచ్చు. అలాగే... కొన్ని సాంకేతిక అంశాలపై నిపుణులను ఓటు హక్కులేని కో ఆప్టెడ్ సభ్యులుగా నియమించుకోవచ్చు. మండలి పెట్టే వ్యయానికి, రోజు వారీ విధి నిర్వహణకు జీఎఫ్ఆర్ వర్తిస్తుంది.
ఉప ప్రణాళిక నిధుల వ్యయంలో మార్పు చేర్పులను కౌన్సిల్ సిఫారసుల మేరకే చేపట్టాలి. ఇంకా... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు కీలక మంత్రిత్వ శాఖలను అప్పగిస్తూ తెలంగాణ నేతలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారిలో విశ్వాసం నింపవచ్చు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ... వారిలో విశ్వాసం నింపేందుకు నిధుల కేటాయింపు, అభివృద్ధికి సంబంధించి జరిగే సమావేశాలకు సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించడం వంటి చర్యలు అవసరం. పెద్ద మనుషుల ఒప్పందంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కాని సమయంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుందని కమిటీ అభిప్రాయపడుతోంది. అందువల్ల, ఈ రాజ్యాంగబద్ధమైన కమిటీ ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
మూడు ప్రాంతాల అభివృద్ధితోపాటు జాతీయ దృక్కోణంలో చూసినా సమైక్యాంధ్రను కొనసాగించాలి. అందరి ప్రయోజనాలు, అత్యధికులకు సంతృప్తి కలిగించడానికి ఇదే అత్యుత్తమ మార్గమని బలమైన రాజకీయ పరిపాలన ద్వారా నిరూపించవచ్చు. విద్యా, పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగర భవిష్యత్తుపై అనిశ్చితి తొలగేందుకు కూడా ఇది అవసరం. నీరు, సాగునీరు వనరులను సమంగా పంచుకునేందుకు వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు, ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయాలి. పై చర్యలు తీసుకున్న పక్షంలో తెలంగాణ ప్రజలు లేవనెత్తిన అన్ని అంశాలను సంతృప్తికరంగా పరిష్కరించవచ్చు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సూచన చేస్తున్నప్పటికీ... తెలంగాణలోని కొన్ని వర్గాలు, అంటే విద్యార్థులు, నిరుద్యోగ యువత (లక్షల ఉద్యోగాలు వస్తాయన్న హామీలు పొందినవారు), నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, న్యాయవాదులు, రైతులు మొదలైన వారు సంతృప్తి వ్యక్తం చేయకపోవచ్చు. తీవ్ర ఆందోళనలకు శ్రీకారం చుట్టవచ్చు. అలాగే, రాజకీయ సంక్షోభం సృష్టించేలా రాజీనామా చేయాలంటూ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి చేయవచ్చు. కొన్నాళ్లపాటు కొనసాగే అవకాశమున్న ఈ ఆందోళనలను చల్లార్చడం రాష్ట్ర నాయకత్వానికి పెను సవాల్‌లాంటిదే.
అయితే... సాధికార సంస్థల విధానం, రాష్ట్రం సమైక్యంగా ఉండటంవల్ల కలిగే లాభాలను ప్రజలు అర్థం చేసుకుంటే ఈ ఆందోళనలను చల్లార్చడం సాధ్యపడుతుందని, అభివృద్ధిపై దృష్టి సారించవచ్చని కమిటీ భావిస్తోంది. అయితే... మూడు ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ, కోస్తాంధ్రలోని ఇతర వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, రాష్ట్రంలోని ఉత్తర సరిహద్దుల్లోని భాగాలు, ఇతర రాష్ట్రాల్లోని ఇతర వెనుకబడి ప్రాంతాల నుంచి తమకు కూడా ఇలాంటి చట్టబద్ధమైన సాధికార కౌన్సిళ్లు నియమించాలనే డిమాండ్లు రావొచ్చు. ఈ ఆప్షన్‌కు కోస్తాంధ్ర, రాయలసీమలో దాదాపు ఏకగ్రీవ ఆమోదం లభిస్తుందని, హైదరాబాద్ మహానగరానికి చెందిన అత్యధికులు కూడా ఆమోదిస్తారని చెప్పవచ్చు.
ఈ పరిష్కార మార్గం అమలులో కొన్ని కష్టాలున్నాయి. అయినప్పటికీ, మూడు ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా ఇది అత్యంత ఆచరణీయమైన, సమతులన మార్గం. జాతీయ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినా.. అన్నింటికంటే ఇదే అత్యుత్తమ మార్గం. ఈదేశంలోని ఇతర ప్రాంతీయ ఆకాంక్షలను పరిష్కరించేందుకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.
No comments:
Post a Comment