Thursday, January 6, 2011

ఆంధ్ర ప్రదేశ్ - శ్రీకృష్ణ కమిటీ * తెలంగాణాపై మొత్తం ఆరు సూచనలు చేసిన శ్రీకృష్ణ కమిటీ

ఆంధ్ర ప్రదేశ్  -  శ్రీకృష్ణ కమిటీ 


తెలంగాణాపై మొత్తం ఆరు సూచనలు చేసిన శ్రీకృష్ణ కమిటీ
మొదటి మూడూ ఆచరణసాధ్యం కాకపోవచ్చు * కమిటీ అభిప్రాయం
ఇది చిదంబరం చెప్పిన మాట 

ఉత్కంఠభరితమైన వాతావరణంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతులను కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం గురువారం నాడు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు అందజేశారు. తెలంగాణ డిమాండ్‌పై శ్రీకృష్ణ కమిటీ మొత్తం 505 పేజీల నివేదికను ఇచ్చింది. ఇందులో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ మొత్తం ఆరు సూచనలు చేసింది.


ఈ సూచనలలో మొదటిది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి. అయితే కమిటీయే ఈ సూచన ఇక ఎంతమాత్రం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది. రెండవ సూచన హైదరాబాద్ ఉమ్మది రాజధానిగా సీమాంధ్ర, తెలంగాణ లుగా విడదీయడం. ఇది కూడా ప్రస్తుత పరిస్థితులలో అంత ఆచరణసాధ్యం కాదనే కమిటీ అభిప్రాయపడింది. మూడవ సూచన రాయల తెలంగాణ, కోస్తాంధ్రగా రాష్ట్రాన్ని విడదీసి హైదరాబాద్‌ను రాయలతెలంగాణలో కలపడం. ఇది కూడా మూడు ప్రాంతాలకూ ఆమోదయోగ్యమైన సూచన కాకపోవచ్చునని కమిటీ భావించింది. ఈ మూడు సూచనలనూ కమిటీయే ఆచరణసాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని హోమ్ మంత్రి చిదంబరం గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

నాల్గవ సూచన రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణాలుగా విడదీసి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం. ఇది తెలంగాణలో తీవ్రమైన ప్రజా ప్రతిఘటనకు దారితీయవచ్చునని కమిటీ అభిప్రాయపడింది.
 
ఇకపోతే తెలంగాణ, సీమాంధ్రలను విడదీసి హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధాని చేయడం, అదే సమయంలో సీమాంధ్ర కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవడం ఐదవ సూచన. ఆరవ సూచన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం.

ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం ఆచరణీయం కాదని మాత్రం కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం అనేది చివరి ఆప్షన్ మాత్రమేనని, ఇప్పుడున్న పరిస్థితులలో రాయల తెలంగాణ ఆచరణ సాధ్యమైన పరిష్కారం కాగలదు గాని, ఇది మూడు ప్రంతాలవారికీ ఆమోదం కాకపోవచ్చుననే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.

No comments:

Post a Comment